3, ఆగస్టు 2021, మంగళవారం

పాడనా తెలుగు పాట | అమెరికా అమ్మాయి సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs

పాటలో ఏముంది?


మాతృభాష పైని ప్రేమ, ఎప్పటికీ మాతృభాష దగ్గరే ఆగిపోతుందని కాదుగా!  ఒక్కో అడుగే వేస్తూ అది మాతృభూమినంతా వ్యాపిస్తుంది. ‘తనను తాను ప్రేమించలేని వాడు, సాటి మనిషినీ ప్రేమించలేడు’  అన్నట్లు, మాతృభాషను ప్రేమించలేని వాడు, మాతృభూమినీ ప్రేమించలేడు. అదీకాక, అన్యభాషల్లో ఎంత ప్రావీణ్యం ఉన్నా, ఇతర భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మాట  మెదడులోంచి వస్తుంది. అదే మాతృభాషలో మాట్లాడుతున్నప్పుడు  హృదయంలోంచి వస్తుంది. అందుకే ఆ మాట హృదయాన్ని తాకుతుంది. ఆ స్పర్శతో మానవ సంబంధాలు  పరిమళిస్తాయి. పరిఢవిల్లుతాయి.

                       ఓ విదేశీ కన్య తెలుగు హృదయంతో బాంధవ్యం ఏర్పరుచుకుని, జీవితమంతా తెలుగు నేలపైనే ఉండాలనుకున్నాక ఆ  అమ్మాయి పుట్టినిల్లు ఏ దేశంలో ఉంటేనేమిటి? పెళ్లయ్యాక ఆమె మెట్టినిల్లు ఈ దేశంలోనే కదా!   ఏదో తెలియని భయం, ఆందోళనల్లో  ‘మీ ఎదుట మీ పాట’ పాడనా అంటోంది కానీ, నిజానికి ఆమె తన పాట తానే పాడుకుంటోంది. ఎందుకంటే తనిప్పుడు 16 అణాల తెలుగమ్మాయి మరి! ‘అమెరికా అమ్మాయి’ సినిమా కోసం దేవులపల్లి కృష్ణ
శాస్త్రి ఎంతో ఆర్తితో రాసిన ఈ గీతానికి  జి.కె. వెంకటేశ్‌ హృద్యమైన బాణీ కూర్చగా,  సుస్వరాల రాణి సుశీల ఎంత ఆర్థ్రతతోనో పాడింది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వినేద్దాం మరి !!

పాడనా తెలుగు పాట

పాడనా తెలుగు పాట
పరవశనై... మీ ఎదుట మీ పాట // పాడనా //

ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన మనం, మన భాషలో మనం మాట్లాడుకోవడం, మన పాటలు మనం పాడుకోవడం మామూలే! అందుకు భిన్నంగా ఒక అమెరికా అమ్మాయి, ఇప్పుడిప్పుడే తన దేశమైన దేశంలో,  తన భాష అనిపించే భాషలో ఓ పాట పాడటానికి సిద్ధమైతే ఎలా ఉంటుంది? ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి, మన భాషా విశేషాన్నీ,  మన సంస్కృతీ విశిష్టతనూ మన ఎదుటే సమ్మోహనంగా పాడుతుంటే మనకెలా ఉంటుంది? మన భాషను మనమే తొలిసారి వింటున్నట్లు అనిపిస్తుంది. వేయిగొంతులతో మనకూ గొంతెత్తి పాడాలనిపిస్తుంది. అవునూ...!, తెలుగు పాటను నేర్చుకున్న ఆ అమ్మాయి తెలుగు పద్యం నేర్చుకోకుండా ఉంటుందా? ఎందుకంటే పద్యం అంతటి అపురూపమైన ప్రక్రియ కదా మరి! పైగా పద్యం అనేది తెలుగులో తప్ప దేశంలోని మరే భాషలోనూ లేని విలక్షణ ప్రక్రియ.  ఆ మాటకొస్తే, యావత్ప్రపంచంలోనే ఏ భాషలోనూ లేని ఒక విశిష్ట ప్రక్రియ పద్యం. పద్యం పైన ఆమే కాదు, ప్రతి తెలుగు బిడ్డా మనసు పెట్టాల్సిన మనోహర ప్రక్రియ మరి!

కోవెల గంటల గణగణలో, గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మూపుల పైన - మసలే గాలుల గుసగుసలో 
మంచి ముత్యాల పేట... మధురామృతాల తేట... ఒక  పాట // పాడనా //

మిన్ను ముట్టే భావోద్వేగాలను అందుకోలేక మాటలు నేలపై చతికిల పడిపోతే ఏమిటి దిక్కు? అప్పుడు పాటలే వాటి చేయందుకుంటాయి. అందుకోవడమే కాదు, ఆనంద పారవశ్యంలో వాటిని ఏడేడు ఆకాశాలు తిప్పుతాయి. నేలపై పడిన మాటలు మహా అయితే,  కాస్త  పక్కకు వెళ్లి ఏ నదీ తరగల మీదుగానో ఆ  నది అంచుల దాకా తీసుకుపోవచ్చు.  ఇంకొంచెం శక్తి ఉంటే, నది నుంచి సముద్రం దాకా నడిపించవచ్చు. అన్నీ అనుకూలించి,  ఏ వాగ్గేయకారుని గాత్రంలోనో పడితే  మాత్రం, భూమ్యాకాశాలకు అతీతంగా ఎక్కడో  దివ్యతాండవం చేస్తాయి. ఏమైనా అక్షరబద్దమైనవీ, స్వరబద్ధమైనవీ లోకంలో శాశ్వతంగా నిలిచిపోతాయనేది నిఖార్సయిన నిజం. అందుకే కవులూ, గాయకులూ ప్రత్యేకించి వాగ్గేయకారులు తమ భావనా లోకాన్ని అక్షర బద్దం, రాగబద్దం చేయడానికి  తమ జీవితాల్నే ధారవోశారు. 

త్యాగయ, క్షేత్రయ, రామదాసులు - తనివి తీర వినిపించినదీ....
నాడునాడుల కదిలించేది... వాడవాడలా కదిలించేదీ 
చక్కెరమాటల మూట - చిక్కని తేనెల ఊట... ఒక పాట  // పాడనా //

నిన్న మొన్నటి దాకా అమెరికాలో ఉండివచ్చిన అమ్మాయి ఈ వాగ్గేయకారుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిందీ అంటే, ఏమిటి అర్థం? ఖండాంతరాల్లో కూడా వారి ఖ్యాతి మారుమోగుతోందనే  కదా!  ఏమైనా, పదంలోని వాక్కును గేయం చేయగల వాగ్గేయకారులు వాగ్దేవిని ఒక భుజాన ఎత్తుకుంటే, రాగతాళ భావప్రదానమైన పదం పట్ల మక్కువ గల పదకవులు వాగ్దేవిని ఒక భజం పైన ఎత్తుకున్నారు. పదకవులైనా, వాగ్గేయకారులైనా, ఒక్కొక్కరు ఒక్కో ప్రపంచం. వారి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే! 

పదకవితకు ఆద్యుడు అన్నమయ్య అయితే,  అన్నమయ్య పదాలను పూర్తిగా, ఎంతో లోతుగా ఆకలింపు చేసుకున్నవాడు క్షేత్రయ్య.  కారణమేదైనా, అన్నమయ్య రాసిన శృంగార సంకీర్తనలు క్షేత్రయ్యను అమితంగా ఆకర్షించాయి. వాటిలోని తేట తెలుగుతనాన్ని మాటల సోయగాన్నీ క్షేత్రయ్య బలంగా గుండెల్లో నింపుకున్నాడు. పైగా రాగాలను భావానుగుణంగా ప్రయోగించడం తెలిసిన సమర్థ సంగీతజ్ఞుడు క్షేత్రయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే, క్షేత్రయ్య పదాలు సంగీత, సాహిత్య, నృత్య క్షేత్రాలకు జీవనదాలు.  క్షేత్రయ్య రాసిన పదాలు 4500 దాకా ఉంటాయి. కానీ, వాటిలో నేడు లభిస్తున్నవి 330 పదాలే!

రామదాసు ..... అకుంఠిత భక్తిపరుడు. ఆయన కవితాధార అనర్ఘలం. ఆయన కీర్తనల్లో సంగీతం భూమిక తక్కువే అయినా, శ్రోతలు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఆయన కీర్తనలు హృదయాన్ని చించుకుని వచ్చిన సరళ సంగీత రచనలు. కొంత మంది పండితుల దృష్టిలో రామదాసు వాగ్గేయకారుడు కాకపోయినా, సామాన్యుల దృష్టిలో కీర్తనా పితామహుడుగా నిలిచిపోయాడు. భద్రాచల రామదాసుగా ఉండిపోయాడు.  అటుఇటుగా రామదాసు కీర్తనలు 140 దాకా ఉంటాయి. కీర్తనలే కాక రామదాసు  ‘‘దాశరథీ కరుణాపయోనిధీ’  అనే మకుటంతో ‘దాశరథీ శతకం’  అనే మరో పుస్తకం రాశాడు. ఇది బహుళ ప్రసిద్ధమైనది.

బాల్యంలోనే త్యాగయ్యకు తన తల్లి సంగీత సాహిత్యాలు గుదిగుచ్చి అతని గుండెపైన వేసింది. అంత పిన్న వయసులోనే జయదేవుడి అష్టపదులూ, రామదాసు కీర్తనలూ, అన్నమయ్య సంకీర్తనలూ నేర్పింది. వీటికి తోడు, తండ్రి పోతన భాగవతాన్ని నూరిపోశాడు. అందుకే పోతనలోని మృదుత్వం,లాలిత్యం  త్యాగయ్యకు బాగా అలవడ్డాయి.  త్యాగరాజస్వామి రచించిన కీర్తనల్లో ఎంతో ఖ్యాతి పొందిన పంచరత్నాలు చాలానే ఉన్నాయి. వీటిలో ఘనరాగ పంచరత్నాలు బాగా ప్రసిద్ధమైనవి. త్యాగరాజు రాసిన మణిమాణిక్యం లాంటి ‘ఎందరో మహానుభావులు’ అన్న కృతిని వినని తెలుగువారు బహుషా ఉండరేమో మరి! 

ఒళ్లంత ఒయ్యారి కోక - కళ్లకు కాటుక రేఖ
మెళ్లో తాళి - కాళ్లకు పారాణి  - మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లుఘల్లున కడియాలందెల - అల్లనల్లన నడయాడే
తెనుగుతల్లి పెట్టని కోట - తెలుగునాట  ప్రతిచోట ఒకపాట // పాడనా //

ఎవరైనా సరే, తనలోంచి తాను బయటికి వచ్చి, తనను తాను చూసుకుంటే తప్ప తనేమిటో పూర్తిగా బోధపడదు.  అలాగే ఈ దేశంలో పుట్టీ, పెరిగి అనునిత్యం ఇక్కడి సంప్రదాయ,  సంస్కృతుల మధ్య గడిపిన వారికి అవి గొప్పగా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ,  ఏ విదేశీయులో వచ్చి.  వాటి విశిష్టతల గురించి చెప్పేదాకా  ఒక్కోసారి మన దృష్టి, వాటి పైన పడకపోవచ్చు. నిజానికి,  ఆకాశాన్ని చుట్టేసుకున్నట్లు నఖశిఖం కమ్మేసే కోక ఎంతటి విశాల భావనకు ఉదాహరణ.  ఆకాశంలో సూర్యబింబంలా  నుదుట వెలుగులు చిమ్మే  కుంకుమబొట్టు. ఇవన్నీ నిలువెత్తు భావుకతకూ,  నిండైన  చైతన్యానికీ  ప్రతీకలే కదా! ఘల్లుఘల్లుమనే అందియలు, జీవితంలో పేరుకుపోయే స్తబ్దతను పారదోలడానికి కాక మరెందుకు? ఇవన్నీ విలక్షణమైనవే, విశిష్టమైనవే! ఎడతెగని జీవన పోరాటంలో అన్నిసార్లూ, అన్నీ మన దృష్టిలో పడకపోవచ్చు. అనుకోకుండా మనకు మనంగానో, ఇతరుల వల్లనో వాటి చెంతగా వెళ్లినప్పుడు వాటిని గుండెలకు హత్తుకోగలగాలి.  వాటినుంచి  మనలోకి చొరబడే ఒక కొత్త అస్తిత్వాన్నీ, కొత్త  ఆనందాన్నీ  జీవితంలోకి  నిండుగా ఆహ్వానించగలగాలి! 

                                                                      - బమ్మెర 

======================================

3 కామెంట్‌లు:

  1. Naa ears "tuppu" vadilindi with this song. Very nice song against telugu samskruti and literature. Your selection of song and explanation is excellent.

    రిప్లయితొలగించండి
  2. ఏమని చెప్పేది... మరో పాటకై ఎదురు చూపులే తప్ప!మనిషి గిరిగీతల్ని దాటకుండా సంస్కరించే శక్తి గల జీవన గీతాలు!!

    రిప్లయితొలగించండి
  3. Excellent expression Anjanna, choosing this song for explanation is also great

    రిప్లయితొలగించండి