8, ఆగస్టు 2021, ఆదివారం

నీకేలా ఇంత నిరాశ పాట | ఆరాధన సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది?

చిత్రం: ఆరాధన, గీతం: దాశరధి సంగీతం ఎస్‌ హనుమంతరావు, గానం: జానకి

"తగిలిన గాయం ఎంత తీవ్రమైనదైనా కావచ్చు. గుండెను పిండేస్తున్న దుఃఖం ఎంత పెద్దదైనా కావచ్చు. ఆ గాయాన్ని ఎవరో వచ్చి మాన్పలేరు. ఆ దుఃఖాన్ని ఎవరో వచ్చి పోగొట్టలేరు. అందువల్ల, నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి. నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి.  ముళ్ల కంచెను నరికి  నీకు నువ్వే బాట వేసుకుని ఆ బాటలో నీకు నువ్వే నడిచి వెళ్లాలి"అంటూ కొందరు చేతులెత్తేస్తూ ఉంటారు. కానీ, ఒక్కోసారి తనను తాను ఓదార్చుకునే ఆ శక్తి కొందరిలో ఉండదు. తనకు తానే ధైర్యం చెప్పుకుని దారిన పడినడిచే ఓపికా తనలో ఉండవు.  అలాంటప్పుడు ‘‘నీ బతుకు నువ్వు బతుకు, నీ ఏడ్పు నువ్వు ఏడువు’’ అంటూ ఎవరి దారిన వారు వెళ్లిపోకుండా, . నాలుగు  ఓదార్పు మాటలు మనసులో వేసి,  నాలుగు  ధైర్యపు వచనాలు గుండెలో దించే వాళ్లు కావాలి. అదే జరిగితే, వారిలో ఒక కొత్త జీవనచైతన్యం అంకురిస్తుంది. వేయి రెక్కలు పుట్టుకొస్తాయి.  అప్పుడింక సుడిగుండాల్లోంచి కూడా ఈదుకుంటూ బయటికి వస్తారు. అగ్ని పర్వతాల్ని  కూడా దాటుతూ వచ్చి జనంలో కలుస్తారు. జనజీవన స్రవంతిలో తడుస్తారు. ‘ఆరాధన’ సినిమా కోసం దాశరధి రాసిన ఈ పాట నిండా,  ఆ ఓదార్పు వాక్కులు ధైర్య వచనాలే ప్రతిబింబిస్తున్నాయి. ఈ సాహిత్యానికి ఎస్‌. హనుమంతరావు సంగీతం సమకూరిస్తే, ఎస్‌. జానకి ఎంతో ఆర్ధ్రతతో పాడారు. మనసు పెట్టి వింటే మనకూ కొంత లాభమే మరి!

నీకేలా ఇంత నిరాశ....!
నీకేలా .... ఇంత నిరాశా, నీకేలా..... ఇంత నిరాశా
నీ కన్నులలో కన్నీరేలా - అంతా దేవుని లీలా // నీకేలా //

ఆగిపోవడం గానీ, ఓడిపోవడం గానీ, ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? ఎవరికి వారు తమ సర్వశక్తులూ వెచ్చించి తమ సమస్యను అధిగమించాలనే అనుకుంటారు. అయితే అడుగడుగునా ఆటంకాలే వచ్చి ఒక్కోసారి అనుకున్నదేదీ అనుకున్నట్లు జరగదు. పైగా,  అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగానే అన్నీ జరిగిపోతుంటాయి. ఈ పరిణామాలు కొందరిని ఒక దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసి నిలువెత్తు దిగులూ, ఆందోళనల్లో ముంచేస్తాయి. అలాంటి ఒక విపత్కర పరిస్థితుల్లో  కొందరు  ‘‘తండ్రీ! నువ్వే కాపాడాలి’ అంటూ భగవంతుని మ్రోలన వాలిపోతారు. అయితే పక్కనే ఉండి అంతా గమనిస్తున్న కొంతమందికి ఇవన్నీ ఉత్త చేతగాని వ్యవహారాల్లా అనిపిస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, భగవంతుడిదే భారం అనుకునే వాళ్లంతా  తర్వాత ఏమీ ఆలోచించకుండా, ఏ చర్యలూ తీసుకోకుండా, ఎల్లకాలం జీవచ్ఛవాల్లా పడిఉంటారని కాదు. ఒకానొక తీవ్ర సంక్షోభ స్థితి నుంచి, ఎడతెగని అలసట నుంచి కాసేపు సేదతీరడానికి మాత్రమే ఈ అడుగులు! ఎన్నో మైళ్ల దూరం,  మండుటెండలో ప్రయాణిస్తూ వచ్చిన వ్యక్తి బాగా అలసిపోయినప్పుడు ఏం చేస్తాడు? ఏ చెట్టునీడనో కాసేపు సేదతీరతాడు. అలాగని ఎప్పటికీ  ఆ చెట్టునీడనే పడి ఉంటాడని కాదుగా! సేద తీరగానే  మళ్లీ  ప్రయాణం మొదలెడతాడు. ఎవరైనా,  బాటసారుల సత్రంలో విడిది చేసేది ..... జీవితమంతా అక్కడే పడి ఉండడానికేమీ  కాదు కదా! కాసేపు విరామంతో  శక్తి పుంజుకుని , తిరిగి తన గమ్యం వైపు సాగిపోవడానికే! కాబట్టి, ఈ భగవద్భావన కూడా కొందరికి సేదతీరేలా చేసే  చెట్టు నీడ లాంటిదే! సుదూర ప్రయాణికులకు మార్గమధ్యాన కాసేపు ఆశ్రయమిచ్చే భాటసారుల  సత్రం లాంటిదే! అలా అని భగవద్భావన అనేది అందరిలోనూ ఒకేలా ఉంటుందని కాదు. ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కాకపోతే ఎక్కువ మందిలో ఈ భావనే ఉంటుంది. ఏమైనా,  ‘దేవుడిదే భారం’ అనో, ‘అంతా దేవుని లీల’ అనో ఎవరైనా అనేయగానే మానవశక్తి అంతా కొడిగట్టుకుపోతోందని ఆందోళన పడాల్సిన  అవసరమేమీ లేదు. 

ఆశ నిరాశల దాగుడు మూతల ఆటేలే ఈ లోకం.... ఆటేలే ఈ లోకం
కష్టసుఖాల కలయికలోనే  ఉన్నదిలే మాధుర్యం.. జీవిత మాధుర్యం
చీకటి కొంత .. వెలుతురు కొంత ఇంతే జీవితమంతా... ఇంతే జీవితమంతా // నీకేలా //

నేడు అస్తమించిన సూర్యుడు, రేపు మళ్లీ ఉదయిస్తాడనే  నిజం ఎవరికి తెలియనిది? అయినా, సూర్యుడు  అస్తమించగానే కమ్ముకునే చీకట్లను చూసినప్పుడు,  చాలా మంది మనసు ఎంతో  కొంత అలజడికీ,  ఆందోళనకూ గురవుతూనే ఉంటుంది. కాకపోతే ప్రకృతీ పరమైన ఈ ఉదయాస్తమయాలు ఒకదాని పిదప ఒకటి 24 గంటల్లో కచ్ఛితంగా సంభవిస్తాయి. జీవితంలో వచ్చే ఉదయాస్తమాయాల తీరు మాత్రం పూర్తిగా వేరు కదా!. వాటి మధ్య వ్యవధి అంత తక్కువగా ఉండదు. చాలాసార్లు ఒకటి పోయి మరొకటి రావడానికి  24 రోజులో,  24 వారాలో కాదు. 24 ఏళ్లు, ఒక్కోసారి అంత కన్నా ఎక్కువ కాలమే పట్టవచ్చు. అందుకే జీవితం తాలూకు అస్తమయాలు మనిషిని అంతగా కలవరపెడతాయి.   జీవితానికి నిర్ణీత కాల వ్యవధి లేనట్లే, మనిషి జీవితంలో జరిగే ఘటనల మధ్య కూడా ఒక నిర్ణీత కాలవ్యవధి అంటూ ఉండదు మరి! నిజానికి ఆశాజనక పరిస్థితులకన్నా, నిరాశాజనక పరిస్థితులే మనిషికి అపారమైన జ్ఞానాన్ని ఇస్తాయనేది ప్రతి జీవితానుభవమూ చెబుతుంది.  ఆ మాటకొస్తే సుఖాల కన్నా  కష్టాలే మనిషిని బాగా రాటుతేలేలా చేస్తాయనేది కూడా ప్రతి హృదయానికీ తెలిసిన పాఠమే! ఇవే కదా! అతి సామాన్యున్ని కూడా  జీవన కురుక్షేత్రంలో అద్భుతంగా పోరాడగలిగే యోధుణ్ని చేస్తాయి!. 

నీ మదిలోని వేదనలన్నీ నిలువవులే కలకాలం - నిలువవులే కలకాలం... 
వాడిన  మోడు - పూయక మానదు - వచ్చును వసంత కాలం... వచ్చును వసంత కాలం
నీతో కలసి.. నీడగ నడిచే తోడుగ నేనున్నాను... నీ తోడుగ నేనున్నాను  // నీకేలా //

ఎంతటి మనోవేధనలైనా ఎంతటి ఆత్మక్షోభలైనా శాశ్వతంగా ఉండిపోవనేది ఎవరూ కాదనలేని సత్యం! కాకపోతే, ఎడతెగని వేధనలు, క్షోభలతో మోడుబారిన జీవితాలు,  మళ్లీ  ఎప్పుడు చిగురిస్తాయనేది అంత కచ్ఛితంగా ఎవరూ చెప్పలేరు.  ఎందుకంటే ప్రతి వసంత కాలంలోనూ తప్పనిసరిగా చిగురు వేసే చెట్టు కాదు కదా మనిషి! కాకపోతే, ప్రకృతికి సమాంతరంగా కాకపోయినా, తమవైన కాల వ్యవధిలో మానవ జీవితంలో కూడా రుతువులు ఉంటాయి. వాటిల్లో భాగంగా వసంతాలూ వస్తాయి. అయితే ఈ వసంతాలు రావడం పోవడం అనేది ప్రకృతి చేతిలో కన్నా ఆ మనిషి చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మౌలికమైన ఒక తేడా కూడా ఉంది ప్రకృతి పరమైన రుతుమార్పులు వద్దన్నా, కావాలన్నా, ఆయా కాలానుగుణంగా జరిగిపోతుంటాయి. మానవ జీవితంలో వచ్చే రుతువుల పరిణామ క్రమం అనేది దానికదిగా కాకుండా,  నువ్వెంత కృషి చేస్తావనేదానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అలాగని, ఎవరికి వారే అని కూడా కాదు, నీలో కలసిపోయి, నీతో కలసి నడవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవాళ్లు కూడా నీ జీవితాన్ని ప్రభావితం చేస్తారు . నీ హృదయాన్ని  ప్రపుల్లితం చేస్తారు . ఒకవేళ ఎవరైనా వారి  జీవితంలోకి  స్నేహమూర్తిగానో, ప్రేమమూర్తిగానో ఇప్పటికే ఎవరైనా ప్రవేశించి ఉంటే, వారింక భాగ్యవంతులే, అక్షరాలా సౌభాగ్యవంతులే!!

                                                                    - బమ్మెర 


2 కామెంట్‌లు:

  1. ఈ పాటలో రచయిత్రి గారు రాసినట్టుగా ఎవరో తోడు వస్తారు మనతో పాటు ప్రయాణం చేస్తారు అంటున్నారు కదా ఇప్పుడు మన జీవితంలో ఎంతమంది ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ జీవితంలో పుట్టి బట్ట కట్టి ఇప్పుడు వరకు ఒంటరిగా ప్రయాణం చేసే వారికి ఎంతమంది చేయూత ఇస్తున్నారు ఇది కలియుగం అది అందరికీ తెలుసు ఈ కలియుగంలో ధర్మం ఒక కాలితో నడుస్తే ఆ ధర్మం మూడు కాళ్లతో నడుస్తుంది కనీసం సహాయం చేసేది లేదు గానీ వారు కొంచెం బాధ పడే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజుల్లో డబ్బులు ఉన్నవాడికి విలువ అది ఒంటరిగా ప్రయూణం ఉంటే అంటే నలుగురు వెళ్లి పెద్ద మాటలు చెప్పి చాలా సహాయం చేస్తారు అదే లేని వాడి దగ్గరికి ఒక్కడును పోడు ఇకపోతే భగవంతుడు కూడా మనకు ఏ విధంగా సాయం చేస్తున్నాడు అని మనమే చూసుకుంది ఎడల మనకు చాలా తక్కువ ఆధారాలు దొరుకుతాయి ఇది కలియుగం గనుక భగవంతుడు మనకు హెల్ప్ చేయడం చాలా తక్కువ అందువల్ల పెద్దలు చెప్తారు బాబు ఉంటుండగానే జీవితం మంచి పనులు చేసి తను చాలించు అని కానీ అది మనం పెడ చెవి పెడతాం. అనుభవించి తీరాలి

    రిప్లయితొలగించండి