12, సెప్టెంబర్ 2021, ఆదివారం

పులకించని మది పులకించు పాట | పెళ్లికానుక సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

 పాటలో ఏముంది?

పులకింతలూ, మైమరపింతలూ ఎప్పుడో అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవే గానీ, హృదయంలో అవి నిలకడగా ఉండే వేమీ కావు. హృదయాల్లో కూడా ఇంకోరకం ఉంటాయి. అవి దే నికీ స్పందించవు.... దేనికీ పులకించవు.... ఎందుకలా అంటే, వాటి వెనుకున్న జీవన నేపథ్యమే అలాంటిదే! జీవితం అన్నాక ఒడుదుడుకులు లేకుండా ఉండవు కదా! ఎడతెగని జీవనపోరాటంలో ఎదురయ్యే వడగాలులూ, సుడిగాలులూ, అనుకోకుండా వచ్చిపడే భూకంపాలు, అగ్నిగుండాలు కొంత మందిని నిర్జీవంగా మార్చేస్తే,  మరి కొంత మందిని దేనికీ స్పందిచలేని  జఢపదార్థంగా మార్చేస్తాయి. అయితే, సంగీతం ఆ జఢత్వాన్ని తొలగించే ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మౌలికంగా సంగీతం,  ఒక మహా విశిష్టమైన కళ. అది పశువుల్ని, పాముల్ని సైతం పరవశింపచేయగల అపారమైన శక్తిగలది. అందువల్లే సంగీతం,  రాతిహృదయాల్ని సైతం, కదలించగలదు. కరగించగలదని, పండితులు సైతం నమ్ముతారు! సంగీతం .... జీవితం కాకపోవచ్చు గానీ, చాలా మంది జీవితంలో అత్యంత ప్రధాన భాగమయ్యిందనేది వాస్తవం! ఏమైనా సంగీత విశిష్టతను రసరమ్యంగా తెలిపే ఈ పాట 1960లో  విడుదలైన ‘పెళ్లికానుక’ సినిమాలోనిది. ఆత్రేయ ఈ గీతానికి ఏ.ఎం. రాజా మాధుర్యాల స్వరకల్పన చేస్తే, జిక్కి అత్యంత మనోహరంగా గానం చేసింది. ఆరు దశాబ్దాల క్రితం నాటి ఈ పాట ఇప్పటికీ తెలుగు నాట ఇంటింటా మారుమోగుతూనే ఉంది! మనం కూడా  ఇప్పుడు మరోసారి తాజాగా ఆ పాటను ఆస్వాదిద్దాం!! 

పులకించని మది పులకించు.....!!



పులకించని మది పులకించు - వినిపించని కథ వినిపించు, 
అనిపించని ఆశల నించు... మనసునే మరపించు గానం.. మనసునే మరపించు // పులకించని //

సంగీతం ఎల్లప్పుడూ స్వరగతులకే పరిమితమై ఉండదు. అది సాహిత్యాన్ని కూడా తనలో కలుపుకుంటుంది. ఆ మేళవింపుతో అది గీతమై, కావ్యమై జీవన గాధలెన్నో గానం చేస్తుంది. మానవాళి సమస్తం, ఆ వైపు చెవి రిక్కించి వినేలా చేస్తుంది. ఆ క్రమంలో,  తమ గురించి తమకే తెలియని మరెన్నో లోతుల్ని విన్నవారికి తెలియ చేస్తుంది. నిజానికి,  నిరంతరం మన వెంటబడి నడుస్తున్నా, మన శరీరం గురించి మనకే చాలా విషయాలు తెలియనట్లు, మన మనసుగురించి కూడా మనకు చాలా విషయాలు తెలియవు. సంగీతమైనా, సాహిత్యమైనా, మరే కళైనా ఏంచేస్తుంది? మనకే తెలియని మన లోతుల్నీ, వ్యధల్నీ, క్షోభల్నీ, దుఃఖాల్నీ మన కళ్లముందు ఆవిష్కరిస్తుంది. వాటిని చూసి,  ఇలాంటి ఆశలు కూడా నాలో ఉన్నాయా? ఇలాంటి వ్యధలూ, క్షోభలు కూడా నాలో ఉంటున్నాయా? అని మనకు తమకు తామే ఆశ్యర్యపోయేలా చేస్తుంది. ఇదంతా అప్పటిదాకా నీ మనో పలకం పై పేరుకుపోయిన ఇనుప రేకుల్ని కరిగించి పక్కకు జారిపోయేలా చేసిన ఫలితమే!

రాగమందనురాగమొలికి ..... రక్తినొసగును గానం 
రేపరేపను తీపికలలకు ... రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం
జీవమొసగును గానం.. మది చింతబాపును గానం  // పులకించని // 

్అనురక్తి, జీవనపరిమళాన్ని పొదుగుకోకపోతే,  దానికి మనుగడ ఉండదు. సరాగం, అనురాగాన్ని నింపుకోకపోయినా మనుగడ ఉండదు. అయితే, సంగీతం, రాగాన్ని  సైతం అనురాగమయం చేస్తుంది. జీవితం పట్ల ఒక రక్తినీ ఆసక్తినీ నింపుతుంది. అందీ అందకుండా అల్లంత దూరాన నడుస్తున్న ఆశల్నీ, కలల్నీ రాగాలాపనతో అక్కున చేర్చుకుని హృదయానికి చేరువ చేస్తుంది. దారం లేని పూవు దండ కాలేనట్లు, చెల్లాచెదురుగా పడిఉన్న భావాలు, మనిషిలో జీవం నింపలేవు. హృదయంలో చైతన్యాన్ని నింపలేవు. అందుకే పూలను దండగా మార్చే దారంలా, భావాలకు ఒక వ్యక్తిత్వాన్నీ, అస్తిత్వాన్నీ ఇచ్చే ప్రధాతగా సంగీతం,  నిలబడుతుంది. అలా నిలదొక్కుకున్న వ్యక్తిత్వం, సహజంగానే తన సమస్యల్ని తాను పరిష్కరించుకోగలదు. జీవితాన్ని పరిపూర్ణంగా జీవించగలదు.

వాడిపోయిన పైరులైనా .... నీరు గని నర్తించును
కూలిపోయిన తీగలైనా ... కొమ్మనలమీ ప్రాకును 
కన్నెమనసు ఎన్నుకున్న...  తోడు దొరికిన మురియు 
దోరవలపే కురియు ... మది దోచుకొమ్మని పిలుచు // పులకించని //

ఏ మనసులోనైనా వేలాది ఆశలు ఉంటాయి. కానీ, కన్నె మనసులో ఇతరమైన ఆశలు ఎన్ని ఉన్నా,  తాను కోరుకున్న తోడు దొరకాలన్నదే అతి పెద్ద ఆశగా ఉంటుంది. కాకపోతే ఆ ఆశ ఫలించాలంటే, కేవలం శరీరం పరిణతి చెందితే సరిపోదు. మనసు కూడా పరిణతి చెందాలి. అది జరగాలంటే, తెలివీ, జ్ఞానాల మధ్య అనుసంధానం ఉండాలి. బ్రతుక్కీ, జీవితానికీ మధ్య అనుసంధానం ఉండాలి. అది కొరవడితే అన్నీ ఉన్నట్లే ఉంటాయి. అయినా, ఏమీ లేనట్లే అయిపోతుంది. మనం గమనించలేకపోవచ్చు గానీ, ప్రపంచంలోని అతి గొప్ప సంధాన కర్తల్లో సంగీతం ఒకటి.. అది లోకంలో పాతుకుపోయిన అలజడినీ, కల్లోలాన్నీ, సద్దుమణిగేలా చేసి, వైరుధ్యాల మధ్య సమన్వయం సాధించడంలో ఒక కీలక భూమిక నిర్వహిస్తుంది. అందుకోసం, తనవంతుగా,  అవసరమైన చోట పెద్ద వంతెనలే నిర్మిస్తుంది. అంత అవసరం లేని చోట కల్వర్టులు కడుతుంది. అప్పుడింక,  అటుఇటుపోకుండా, వంతెనల్లోంచి, కల్పర్టుల్లోంచి నీరు పంటపొలాలకే చేరినట్లు, అనురాగమయమైన హృదయం, తన తోడు కోసం అడుగులు వేస్తుంది. ఆశించిన తోడు దొరకగానే పులకించిపోతుంది. హృదయాన్నీ, జీవితాన్నీ సమర్పణ చేస్తుంది.  

పులకించని మది పులకించు ... వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల నించు.. మనసునే మరపించు.....
ప్రేమ... మనసునే మరపించు ....... // పులకించని //

అంతస్సారంగా అసలు విషయం ఇక్కడ చెప్పుకోవాలి! గొంతూ, గుండె కలిసినప్పుడు రాగం ధ్వనించినట్లు, అనురాగమయమైన హృదయం పులకించినప్పుడు అక్కడ అపురూపమైన ప్రేమ అంకురిస్తుంది. ఆ ప్రేమ ప్రత్యేకత ఏమిటంటే అది మనసునే మరపిస్తుది. మనసును మరపింపచేయడం అంటే ఏమిటి? ఒక రకంగా లోకాన్నే మరపింపచేయడమే! తమదైన ఒక కొత్త ప్రేమలోకంలోకి ప్రవేశించడమే! ఆ లోకంలోకి ప్రవేశించిన వారంతా ఎప్పటికీ అక్కడే ఉండిపోతారని కాదు గానీ,  ఆ కొత్త బంగారు లోకంలో కొంతకాలమైతే, ఉండిపోతారు. కొన్నాళ్ల తర్వాత మనమంతా వాళ్లకు ప్రేమపాత్రులమే కాబట్టి,  మళ్లీ తిరిగి మనలోకం లోకి వచ్చేస్తారు. అందువల్ల ఆ ప్రేమలోక విహారుల్ని  కొంత కాలం డిస్టర్బ్‌ చేయకుండా ఉంటే చాలు. కొన్ని ఎదురీతలు తప్పకపోయినా, అంతిమంగా వాళ్లు కోరుకునే  ప్రేమ శిఖరాల్ని వారు అందుకోగలరు!  

                                                                                   - బమ్మెర 

3 కామెంట్‌లు: