19, సెప్టెంబర్ 2021, ఆదివారం

అంతా భ్రాంతియేనా ? పాట | దేవదాసు సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది?


ప్రేమికులకు హృదయాలే సమస్తం! వారికి ప్రేమలూ, వాటి భావోద్వేగాలే తప్ప మరేమీ కనపడవు. పెద్దవారికేమో, ఆ రెండు తప్ప మిగతావన్నీ కనపడతాయి. నిజమే! హృదయం అన్నది మనిషి లోలోపల ఉండే ఒక అద్భుతం. ఒకరకంగా దానికదే ప్రపంచం. అయితే, అందరూ ఆ ప్రపంచాన్ని గుర్తిస్తారన్న గ్యారెంటీ లేదు. కాకపోతే  అందరూ గుర్తించే ఓ పెద్ద  ప్రపంచం ఒకటి హృదయానికి ఆవల ఉంటుంది.  నిజానికి అది ఒక ప్రపంచం కాదు, అది వేనవేల ప్రపంచాల సముదాయం! ఆ ప్రపంచాల్లో ఒక్కొక్కటీ ఒక్కోచోట  మానవ జీవితంతో గాఢంగా ముడివడి ఉన్నవే! జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసేవే! అందుకే పెద్దవారి దృష్టి అంతా ఆ బాహ్య ప్రపంచాల పైనే ఉంటుంది. అయితే వాటితో పెద్దగా సంబంధమేదీ లేకుండా, మసలే ప్రేమలు, మమకారాలు ... వాళ్ల దృష్టిలో చాలా చిన్నవి,... అల్పమైనవి. అందుకే ఎవరైనా వాటికి పెద్ద స్థానం ఇవ్వాలని చూస్తే, వారు తీవ్రంగా ఖండిస్తారు. అవసరమైతే రకరకాల ఆయుధాలు విసిరి  వాటిని అంతమొందించాలని చూస్తారు. లేదా అణచివేయాలని చూస్తారు. ఈ అణచివేతలో యువ హృదయాలు ఏమైపోయినా వారికి పట్టదు. అవి ఎంతటి  వేదనాగ్నిలో కాలి బూడిదైపోయినా, వారి హృదయం ఏమాత్రం చలించదు. తమ అధికార అంకుశానికి వారి జీవితాలు బలైపోతున్నాయన్న బాధ వారికి ఏ కోశానా ఉండదు. 

1953 లో విడుదలైన ‘దేవదాసు’ సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రాసిన ఈ పాట ఆ తరహా జీవితాల్నే ప్రతిబింబిస్తోంది.  ఎం.ఎస్‌. సుబ్బురామన సంగీత సారధ్యంలో రాధ పాడిన ఈ పాట విడుదలై ఇప్పటికి దాదాపు ఏడు దశాబ్దాలు కావస్తోంది. అయితేనేమిటి? ఈ నాటికీ జనం హృదయాల్లో ఆ పాట ఎప్పటికీ తరగని కొత్తదనంతో మారుమ్రోగుతూనే ఉంది. అసలీ పాటలో  అంత విశిష్టత ఏముంది? అని అడిగితే ఎవరేం చెబుతారు? అది ఎవరికి వారే తెలుసుకోవాలి! ఆ వేదనా భరిత గీత సృష్టికి  కారణభూతులైన వారందరినీ వేనోళ్లా కీర్తించాలి!!.

అంతా భ్రాంతియేనా? 




అంతా భ్రాంతియేనా? - జీవితానా వెలుగింతేనా? 
ఆశా నిరాశేనా? - మిగిలే దీ చింతేనా?

నిశితంగా గమనిస్తే, సత్యానికీ, భ్రమకూ మధ్యన రేఖా మాత్రమైన తేడాయే ఉంటుంది. మరి కొన్నిసార్లు అసలది ఉన్నట్లే అనిపించదు. అందుకే  ఎండమావుల్ని చూసి, నీళ్లనుకోవడం, ఎంతో మందికి జీవితానుభవం అయ్యింది.  ఒకవేళ ఆ తేడా చిన్నగానో, పెద్దగానో ఉన్నట్లనిపిస్తున్నా, , దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమేమీ లేదనేది మరి కొంత మంది ఆలోచనా ధోరణి. నిజానికి ఈ ధోరణే  జీవితాల మధ్య మహా అగ్నిగుండాలు తలెత్తడానికి  కారణభూతమవుతుంది. మౌలికమైన విషయం ఏమిటంటే, కనీపెంచి పెద్దచేసిన చాలా మంది తలిదండ్రులకు  తమ పిల్లల పైన తమ ఆధిపత్యాన్ని కోల్పోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే ప్రతిదీ తమ నిర్ణయానుసారమే జరగాలనుకుంటారు. అయినా, ఎంతో జీవితానుభవం ఉన్న తామే ఒక్కోసారి ఒక నిర్ణయం తీసుకోవడానికి తటపటాయిస్తుంటే, ఏమీ తెలియని పసికందులకు యదేచ్ఛగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిస్తే ఏమైనా ఉందా? అంటూ బుసలు కక్కుతుంటారు.. ‘అయినా జీవితం గురించి లోకం గురించి  పిల్లలకు ఏం తెలుస్తుంది? ప్రణయోద్వేగాలతో కొట్టుకుపోవడం తప్ప,’ అనుకుంటారు.  అందుకే అడుగడుగునా  తామే వారి చేయి పట్టుకుని నడిపించాలనుకుంటారు. వారి శరీరాలకే  కాదు, వాళ్ల హృదయాలకు కూడా  మార్గదర్శకత్వం వహించాలనుకుంటారు. దాదాపు. ప్రతి రెండు తరాల మధ్య తలెత్తే ఘర్షణకంతా బీజం ఇక్కడే పడుతుంది!  

చిలిపితనాలా చెలిమే మరచితివో...,  తలిదండ్రుల మాటే దాటా వెరచితివో...., 
పేదరికమ్ము, ప్రేమ పథమ్ము, మూసీవేసినదా?  - నా ఆశే దోచినదా?

జీవనయానంలో  కొండంత అవరోధం వచ్చిపడటం వెనకాల,  ఒకటి రెండు కాదు, కారణాలు క ట్టగట్టుకుని ఉంటాయి. ఒలిచి చూస్తే ఉల్లి పొరల్లా ఒక్కొక్కటే బయటపడతాయి. ఏదో అనడమే గానీ, ప్రాణప్రదమైన చిన్ననాటి చెలిమిని ఎవరు మాత్రం మరిచిపోగలరు? నిజానికి, అవరోధాల వెనుక మన ఊహకందని ఇతర కారణాలే అనేకం ఉంటాయి. పైకి కనిపించేవీ, కనిపించనివీ ఇలా చాలా కారణాలు చుట్టచుట్టుకుని ఉంటాయి. వీటితో పాటు, సంప్రదాయాలు, ఆచారాలు, తరతరాలుగా వస్తున్న వంశ గౌరవాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చేవాళ్లు, అడుగడుగునా అడ్డుపడుతుంటారు.  పేదరికం ఎలాగూ పెద్ద కారణమే అవుతుంది. ఇన్నిన్ని ఆటంకాల మధ్యన ప్రేమ మార్గం కొనసాగడం అంటే మాటలా? నిజానికి అది కొనసాగడం అసంభవమేమీ కాదు. కాకపోతే, అందుకు చాలా పెద్ద తిరుగుబాటు చేయాల్సి ఉంటుంది. . ఒక్కొక్క అవరోధాన్నీ లెక్కలేనన్ని ప్రతీఘాతాలతో కూలదోస్తూ వెళ్లాల్సి ఉంటుంది అది అందరితో అయ్యేపనేనా? కొంత దూరం ఆ దిశగా  వెళ్లినా, బాగా అలసి సొలసిన దశలో కొందరి అడుగులు తిరోగమన దిశగా  వెళతాయి. పెద్దలందరి  మనసు నొప్పించి తమ దారిన తాము వెళ్లడం వల్ల అదనంగా వచ్చిపడే అంత పెద్ద ప్రయోజనం ఏముంది?  అన్న అంతర్మధనం ఒకటి వాళ్ల గుండెను తొలుస్తుంది. దీనికి తోడు అప్పటిదాకా ఎంతో గౌరవ భావంతో చూస్తూ వచ్చిన కన్నవారిని  ఇప్పుడు ఈ కారణంగా ధిక్కరించడం సబబు కాదేమో అనిపిస్తుంది. రోజులు గడిచే కొద్దీ,  ఆవేశాలు త గ్గి, అడుగులు వెనుకంజ వేయడం మొదలవుతుంది. అదే సమయంలో ,  ‘జీవిత చరమాంకంలో ఉన్నవాళ్ల కోసం జీవితపు తొలి అంకంలో ఉన్నవాళ్లు బలికావాలా?’ అన్న మరో మీమాంస కూడా గజస్థంభమై ఎదురుగా నిలబడుతుంది. 

మనసునలేనీ వారీ సేవలతో - మనసీయగలేనీ నీపై మమతలతో
వంతల పాలై చింతిలుటే నా వంతా దేవదా ! నా వంతా దేవదా!

ఒక మహా నిస్సహాయ పరిస్థితిలో పెద్దవారి ముందు తలవంచిన ఫలితం ఊరికే పోదు! కళ్ల ముందే జీవితం, పశ్చాత్తాపాల అగ్నికి ఆహుతైపోతుంది. పైగా, అనుకోకుండా జీవితంలోకి వచ్చిపడిన వాళ్లకోసం అహోరాత్రులూ సర్వశక్తులూ ధారవోయాల్సి రావొచ్చు. ఇది ఒక వంకన వేధిస్తుంటే, ఆనందంగా జీవితాన్నే అర్పించుకోవాలనుకున్న  వాళ్లు, అందనంత దూరంగా వెళ్లిపోతారు. అయినా, తెగించి చెంతన వాలిపోదామనకుంటే, మళ్లీ సంప్రదాయాలే అడ్డుపడతాయి.  ఈ సంప్రదాయాల ఈటెలు, ఈ వంశ ప్రతిష్టల ఖడ్గాలు, జీవితపు తొలి అడుగునా అడ్డుపడతాయి.  జీవితపు మలి అడుగునా అడ్డుపడతాయి. అయినా, సంప్రదయాలనేవి, జీవితాన్ని సమున్నత స్థాయికి తీసుకువెళ్లడానికి తోడ్పడాలే గానీ, భూస్థాపితం చేయడానికి ఊతం కాకూడదు కదా! జరుగుతున్నది మాత్రం అదే మరి! అనుభవమైన వారికే తెలుస్తుంది గానీ, మనసున లేని వారి కోసం జీవితాన్ని అర్పణ చేయాల్సి రావడం నిజంగా ఎంత పెద్ద విషాదమో..., జీవితాన్ని అర్పణ చేయాలనుకున్న వారి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోవడం అంతే పెద్ద విషాదం! చివరికి జీవితమంతా వగచి వగచి రాలిపోవల్సి రావడం నిజంగా ఎన్నెన్నో శోక సముద్రాలు ఈదడంతో సమానం! పైగా,  ఈ శోకం ఎప్పటికీ తీరేది కాదు, ఈ ఆశ ఈ జన్మలో తీరేది కాదని ఎప్పటికప్పుడు తేలిపోతుంటే, ఏ హృదయమైనా ఏం చేస్తుంది? అక్కడో ఇక్కడో  ఎవరో చెప్పగా విన్న నమ్మకంతో,  మరు జన్మకోసం లెక్కలు వేస్తుంది. ఎన్ని జన్మలైనా ఎత్తి అనుకున్నది నెరవేర్చుకోవాలనుకుంటుంది  ఏదో ఒక జన్మలో తన కల నెరవేరుతుందని వేవేల కన్నులతో ఎదురు చూస్తుంది. 

                                                                       - బమ్మెర 

5 కామెంట్‌లు: