29, సెప్టెంబర్ 2021, బుధవారం

ఏదో ఏదో అన్నది పాట | ముత్యాల ముగ్గు సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది?

రూప సౌందర్యం కన్నా, హృదయ సౌందర్యం గొప్పదని చెబుతారు గానీ, ఒక్కోసారి ఆ మాటలో పూర్తి నిజం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే, రూపసౌందర్యం తగ్గుముఖం పట్టడానికీ, దాని పైన ఆసక్తి తగ్గడానికీ ఎంత లేదన్నా, కొన్ని సంవత్సరాలైనా పడుతుంది. అదే హృదయ సౌందర్యం విషయంలో అయితే,  రవ్వంత అనుమానం ఏర్పడితే చాలు...అప్పటిదాకా అపురూపంగా అనిపించిన హృదయ సౌందర్యం కనుమరుగైపోవడమే కాదు, పరమ వికృతంగా కూడా కనిపించవచ్చు. . దాంతో అప్పటిదాకా నూరేళ్ల బంధం అనుకున్నది కూడా క్షణాల్లో తునాతునకలైనట్లు అనిపించవచ్చు. ఎంతటి వారికైనా అది భరించలేని బాధే!. నిజానికి అనుమానాలన్నీ నిజాలనే మీ కాదు కదా! అయినా,  ఆ అనుమానం అబద్ధం అని రుజువయ్యే నాటికి ఒక్కోసారి ఏళ్లే గడిచిపోవచ్చు. ఒకవేళ అబద్దమని రుజుమైనా, ఆ కారణంగా, అప్పుడెప్పుడో ఎడబాసిన జీవితాలు తిరిగి కలిసిపోవడం అసంభవమే కావచ్చు. ఒకవేళ ఎలాగోలా కలిసినా ఆ బంధాల మధ్య మునుపటి ఆ  నిర్మలత్వం ఉండ కపోవచ్చు.  మునుపటి ఆ జీవన మాధుర్యం ఉండకపోవచ్చు. అందుకేనేమో చాలా మంది ప్రేమమూర్తుల దృష్టి ఆరంభంలో రూపసౌందర్యం వద్దే ఆగిపోతుంది. ఆ సౌందర్య ఆస్వాదనలో ఒలికే ఈ పాట 1975లో విడుదలైన ‘ముత్యాల ముగ్గు’ సినిమాలోనిది! డాక్టర్‌. సి. నారాయణరెడ్డి రాసిన ఈ పాటకు కె.వి. మహాదేవన్‌ కూర్చిన బాణీ ఎంతో మధురమైనది. అయితే, రామకృష్ణ గానం ఆ పాటకు అంత కు మించిన  మాధుర్యాన్ని నింపింది. మరోసారి ఇప్పుడు ఆ పాటను వింటే తప్ప ఈ ప్రశంసలోని నిజమెంతో మనసుకు తెలిసి రాదు!!

ఏదో ఏదో అన్నది....


ఏదో ఏదో అన్నది ... ఈ మసక మసక వెలుతురు
గూటిపడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. //ఏదో ఏధో// 

వినిపించీ వినిపించనట్లు ఉండే మాటలు ఎప్పుడైనా చాలా లోతుగా ఉంటాయి.  కనపడీ కనపడనట్లు ఉండే దృశ్యాలు ఎక్కడైనా ఎంతో భావాత్మకంగా ఉంటాయి. అవతలి వాళ్లు ఎంత సన్నగా మాట్లాడినా వినగలిగే కొందరు వినేస్తారు..  దృశ్యాలు ఎంత మసకమసకగా ఉన్నా చూడగలిగే కొందరు చూసేస్తారు. మౌలికంగా, కొత్త పెళ్లికూతురు అంటే ఎవరు? పెళ్లి తర్వాత అనూహ్యమైన ఒక  కొత్త జీవితంలోకి అడుగిడేందుకు సిద్ధమైపోయిన వ్యక్తి అని కదా! కొత్తగా వచ్చిపడే ఆ జీవితం చుట్టూ ఉండే వారిలో దాదాపు అందరూ కొత్తవాళ్లయ్యే ఉంటారు. ఆ కొత్త వ్యక్తుల్నీ, ఆ కొత్త పరిస్థితుల్నీ ఆకళింపు చేసుకోవాలంటే, ప్రతి అంశాన్నీ ఎంతో నిశితంగా గమనించాల్సి ఉంటుంది. అందుకే  ప్రతి మాటనూ ఆమె వేయి చెవులతో వింటుంది.  ప్రతి దృశ్యాన్నీ వేయి కళ్లతో చూస్తుంది. అంతే కాదు,  ప్రతి పరిస్థితినీ వేయి కోణాల్లోంచి పరిశీలిస్తుంది. అందుకే మనకు వినిపించనివెన్నో ఆమెకు వినిపిస్తాయి. మనకు కనిపించనివెన్నో ఆమెకు కనిపిస్తాయి. కాకపోతే, అరుదుగానే కావచ్చు...... ఆమెకు కూడా వినిపించని కొన్ని మాటలు ఉంటాయి.  కనిపించని దృశ్యాలు లేదా పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. అవి ఆమెకు ఒక నవ వధువుగా ఆశించిన దానికన్నా మించిన ఆనందాన్నే ఇవ్వవచ్చు. లేదా ఆశించిన దానికి పూర్తిగా భిన్నమైన లేదా పరమ విరుద్ధమైన పెద్ద క్షోభనే మిగుల్చవచ్చు.  కచ్ఛితంగా ఏమవుతుందనేది ఎవరికైనా కాలమే చెప్పాలి!

ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియపడే ఒయ్యారం 
ముడుచుకునే కొలది మరీ మిడిసిపడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలి // ఏదో ఏదో//

జీవిత భాగస్వామికోసం ఏ వరుడిలోనైనా ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఉంటుంది.  కాకపోతే, ఎక్కువమంది దృష్టి సహజంగానే,  కొత్త పెళ్లి కూతురు రూప సౌందర్యం పైనే ఉండవచ్చు. అతని కళ్లకు ఆమె  ఒదిగి కూర్చోవడంలోని ఒయ్యారాలే కనిపించవచ్చు. ఆమె ముడుచుకోవడంలోని సింగారాలే కనిపించవచ్చు. కానీ, ఆమె అలా ఒదిగి కూర్చోవడంలో ఎన్నెన్ని దిగులూ, ఆందోళనలు ఉన్నాయో ఎవరికి తెలుసు? తాను కొత్తగా అడుగిడబోయే సంసార చదరంగంలో,  ఏ స్థానంలో ఎవరున్నారో, వాళ్లు ఎలాంటివారో, వాళ్లతో ఎలా మసలుకోవాలో ఎలా బోధపడుతుంది? ఆ విషయాల్లో ముందుగా ఏ అంచనా ఉండదు కదా! పెళ్లి నాటి దాకా ఆమె ఒక స్వేచ్ఛా విహంగం. పెళ్లి తర్వాత ఆ స్వేచ్ఛ ఉండదు కదా! అందుకే  ఆ విస్తారమైన తన రెక్కల్ని తానే కత్తిరించుకోవాలి. ఎగిరే తన మనసును తానే కట్టడి చేసుకోవాలి! ఇపన్నీ ఆమె గుండె పైన హఠాత్తుగా వచ్చి పడిన అదనపు బాధ్యతలు..... భారాలు. కొత్తపెళ్లి కొడుకు ఆశలూ, ఆకాంక్షలూ సరే! అతన్ని తనకు అప్పగించిన ఆ తల్లిదండ్రుల ఆశలూ, ఆకాంక్షలు కూడా ఉంటాయి కదా ! అవే కాదు, వాటితో పాటే వాళ్లల్లో, కొత్తగా మొదలైన భయాలూ ఆంధోళనలు కూడా ఉంటాయి! వాటిల్లో ఇప్పటి దాకా తమ కనుసన్నల్లో, తమ అడుగు జాడల్లో మసలుకున్న అబ్బాయి, ఇకపైన అలా ఉండడేమో అన్న భయం ఒక వైపు, తనదైన వేరే ప్రపంచంలో పడిపోయి, తమకింక దూరమైపోతాడేమోనన్న అన్న ఆందోళన మరో వైపు వారి హృదయాల్ని ముప్పిరి గొంటాయి.  అదంతా ఏమీ ఉండదని ఎవరికి వారు తేల్చేసుకోవడం అంత తేలికేమీ కాదు కదా!  ఇలాంటి తనలోవి, బయటి వి పలు అంశాల పైన ఒకదాని తర్వాత ఒకటిగా ఆలోచించే కొద్దీ ఏమౌతుంది? ఎంత లేదన్నా గుండె బరువెక్కిపోతుంది. ఈ స్థితిలోనే మునుముందు ఎలా ఉండబోతోందో ఏమీ తోచక, వధువు తనలోకి తానే ఒదిగిపోతుంది. తనలోకి తానే ముడుచుకుపోతుంది. వరుడు అవేవీ పట్టించుకోకపోగా, ఆమె సోయగాలు చూడటానికి తనకు వేయి కళ్లు ఎందుకు లేవు? అంటూ తనలో తాను మధ నపడుతుంటాడు! 

నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమి నొసగేరు
పులక రించు మమతలతో పూలపాన్పు వేశారు // ఏదో ఏదో //

ఆశించినదానికన్నా అపురూపమైనది ఏదో అనుకోకుండా తన జీవితంలోకి ప్రవేశించినప్పుడు,  ప్రత్యేకించి  దాని వెనుక మానవ సాయమేదీ లేదనిపించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది?  కొంతమందికైతే, కొన్ని అతీతమైన భావాలు కలుగుతాయి. భువి నుంచి కాకుండా దివి నుంచి ఎవరో దేవ దేవుళ్లు ఆమెను తనకు ఒక అపురూప కానకగా  చేరవేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా తనకు  ఎదరుపడిన  వాళ్లంతా, నేల మీద తారట్లాడే మాటలే వినిపించారు. ఏదో ఏటి తరగల పైన కదిలే పాటలే వినిపించారు. ఉన్నట్లుండి, ఒక సౌందర్య రాశి,  నక్షత్రాల భాషలో మాట్లాడుతుంటే, నభో నిలయాల్లో మారుమ్రోగే రాగాలేవో వినిపిస్తుంటే, ఆ వరుడికి  క చ్ఛితంగా ఆమె దైవదత్తమైన దివ్య కానుకే  అనిపిస్తుంది. పైగా,  అది ఏనాటికీ తరగనీ, కరగనీ మహా ఐశ్వర్యమే అనిపిస్తుంది. భావోద్వేగాలు వారికి అంతటి మహానందాన్నీ, గొప్ప పారవశ్యాన్నీ అందిస్తుంటే నిండు మనసుతో కొండెత్తు శుభాకాంక్షలు అందించాలి!  దివికీ, భువికీ మధ్యనున్న రేఖను అంత అవలీలగా మాయం చేసిన వారి ప్రేమశక్తిని మనం ఒక్కొక్కరం వేయి హృదయాలతో అభినందించాలి!!

                                                                   - బమ్మెర 

6 కామెంట్‌లు:

  1. Excellent song. A newly couple while they are traveling the husband thoughts writer expressed very nicely. Your review is very nice. This picture released almost all decades ago. But very nice picture.

    రిప్లయితొలగించండి
  2. వివరణ, విశ్లేషణ అద్భుతం,లేకుంటే పాట గొప్ప తనం తెలిసేది కాదు

    రిప్లయితొలగించండి
  3. Excellent song
    Writer balanced,
    Unexpected gift of wife oneside towards unknown travel other side..

    రిప్లయితొలగించండి