6, అక్టోబర్ 2021, బుధవారం

ఇది తొలిరాత్రి ... కదలని రాత్రి ...! పాట | మజ్ను సినిమా | తెలుగు పాత పాటలు | Telugu old songs |

పాటలో ఏముంది? 




దేనికైనా ఒక ప్రారంభం ఉంటుంది. కాకాపోతే, కొన్ని ప్రారంభాలు మనకు తెలిసి జరిగితే,  మరికొన్ని మనకు తెలియకుండా జరిగిపోతాయి. మన జన్మ మనకు తెలియకుండా జరిగిన ప్రారంభమే కదా! అయితే, మనకు తెలియకుండా జరిగే ప్రారంభాల్లో పెద్దగా మాటలేమీ ఉండవు. అక్కడ ఎక్కువగా మౌనమే రాజ్యమేలుతుంది. అదే మనకు తెలిసి జరిగే ప్రారంభాల్లో, చాలా మాటలు ఉంటాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద ప్రసంగాలే ఉంటాయి. మామూలుగా అయితే, ఒకరికొకరు చెప్పుకునే కథలే ఉంటాయి. కథ అంటే జరిగిపోయినవి అనే కాదు కదా! జరగబోయే లేదా జరగాలని కోరుకునే వాటి  గురించిన ఊహల్ని కూడా  కథలుగా చెప్పుకోవచ్చు. అయితే, అన్ని కథలూ, ఆశించినట్లు సాగవు కదా! కొన్ని కథలైతే,  ఆశించినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఒక్కోసారి అవి రాతికొండలు  సైతం,  కన్నీరు రాల్చేటంత పరమ విషాదమయంగా ఉంటాయి. 1987లో విడుదలైన ‘మజ్ను’ సినిమాలోని ఈ పాట అలాంటి విషాదానికి ప్రతిరూపమే! దాసరి నారాయణ రావు రాసిన ఈ పాటకు లక్ష్మీకాంత - ప్యారేలాల్‌ బాణీ కడితే, బాలసుబ్రహ్మణ్యం తన గొంతుతో భాస్వరమే ఒలికించాడు. పెద్ద మనసుతో వింటే గానీ, ఆ బాదేమిటో బోధపడదు!!

ఇది తొలిరాత్రి ... కదలని రాత్రి ...!


ఇది తొలిరాత్రీ... కదలని రాత్రీ ...
ప్రేయసి రావే ,.,. ఊర్వశి రావే.... ప్రేయసి రావే... ఊర్వశి రావే...
నీవు నాకు... నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ.....

తొలిరాత్రి అనగానే కొందరు అదేదో అంటే దేహాల విషయం,  ఆ దేహాల్ని అంటిపెట్టుకున్న మనసు విషయమే అనుకుంటారు. కొందరి విషయంలో అదే నిజం కావచ్చు. కానీ, మరికొందరిలో విషయం పూర్తిగా వేరవుతుంది.  అది తనవూ, మనసుల  పొలిమేరలు దాటి విషయం ఆత్మగతమై అది మొత్తం జీవితాన్నే ఆవహిస్తుంది. జీవితాకాశాన్నే చుట్టేస్తుంది. ఆకాశం అంటే అన్నిసార్లూ వెన్నెల రాజ్యం అనే కాదు కదా! కొందరి విషయంలో కళ్లు తెరిచినా, మూసినా ఒకటే అయ్యే కటిక గాఢాంధకార లోకమది! అదేదో  గ్రహాంతరాలంలో ఏర్పడిన సంక్షోభ పరిణామం అని కూడా కాదు. ఇది హృదయాల మధ్య ఏర్పడిన కార్చిచ్చు పలితం! అక్కడ కమ్మేసినది.... అపార్థాలతో పెల్లుబికిన అనర్థాల అగ్ని పర్వతాలు బ్రద్దలైనప్పటి భీభత్సపు చీకటి.  తప్పెవరిది? అనే  ప్రశ్న ఇక్కడ అప్రదానం. తప్పు ఒకసారి ఆ వైపున ఉండవచ్చు. ఒకసారి ఈ వైపున ఉండవచ్చు ఒక్కోసారి రెండు వైపులా ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, ఇరువైపులా అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని ఘటనల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, బెంబేలెత్తిన హృదయాలు వేసిన తప్పటడుగులే కనిపిస్తాయి.  .    

వెన్నెలమ్మా దీపాన్నీ ఆర్పమన్నదీ ... మల్లెలమ్మా  పరదాలు మూయమన్నదీ 
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ .... దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ... 
నీ రాక కొరకు తలుపు ... నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి పిలిచి - వేచి వేచి -  ఎదురుచూస్తున్నవీ .... 
ప్రేయసి రావే ... ఊర్వశి రావే.... ప్రేయసి రావే... ఊర్వశి రావే

పరదాలు మూయమని చెబుతున్న మల్లెలమ్మను చూసి, గదిలో మత్తుగా తిరుగుతున్న ధూపాన్ని చూసి, చివరికి తననే ఆర్పేయమని చెబుతున్న వెన్నెలమ్మను చూసి దీపం పగలబడి నువ్వుతోంది. ఎందుకంటే, గదిలోని దీపానికి మాత్రమే అసలు కథ తెలుసు. ఆ దీపాన్నే ఆర్పేస్తే,  కావాలనుకున్నప్పుడు ఆ కథ చెప్పేదెవరు? అందుకే వెన్నెల అమాయకత్వాన్నీ, మల్లెల బేలతనాన్నీ చూసి దీపం విరగబడి నవ్వుతోంది. ప్రేమికులు ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారనీ,  ఎవరి లోకంలో వారు ఉన్నారని అన్నింటికన్నా ముందు తెలిసింది దీపానికే! ఎందుకంటే కళ్లింత చేసుకుని గదిలో ఉన్నది తానొక్కతే కదా! ఆకాశంలో తిరిగే వెన్నెలకు గానీ, తోటల్లోనో, లేదా పొదరిల్లలోనో తలలూపే మల్లెలకు గానీ, అసలు విషయాలు ఏం తెలుసు? అందరి తొలిరాత్రుల్లాంటిదే వీరి తొలిరాత్రి కూడా అన్న భ్రమలో, ఆ తాలూకు మత్తులో ధూపం గదినంతా చుట్టేస్తోంది. కానీ, ఆ ఇద్దరూ ఎప్పుడో దూరమైపోయారు కదా! అందుకే ఆ తంతులేవీ వీరి వంతున లేవనే క టోర సత్యం ఒక్క దీపానికే తెలిసింది.  ప్రేమికులు చివరికి నేస్తాలుగా  కూడా మిగలని వైచిత్రి గురించి ఒక్క దీపానికే తెలిసింది. తలుపులూ, పానుపులూ ఎంత పిలిచినా, ఎంత ఎదురుచూసినా, రావలసిన వారెవరూ రానే రారని ఒక్క దీపానికే బోధపడింది. అందుకే ఎవరేమనుకుంటున్నా, పట్టించుకోకుండా దీపం పగలబడీ, విరగబడీ నవ్వుతోంది.  అన్ని దశల్లోనూ నవ్వేదీ, నవ్వగలిగేదీ లోకంలో వేదాంతి ఒక్కడే కదా! ఆ దీపాన్ని ఇప్పుడు మనం ఏమని పిలవాలి? వేదాంతి అనేగా!!, నిత్యం వేదాలూ, ఉపనిషత్తులూ మారుమోగే చోట మసలే దీపానికి వేదాంతం అబ్బకుండా ఉంటుందా మరి! 

వెన్నెలంతా అడవి పాలు కానున్నదీ ...  మల్లె మనసు నీరుకారి వాడుతున్నదీ 
అనురాగం గాలిలో దీపమైనదీ - మమకారం మనసునే కాల్చుతున్నదీ 
నీ చివరి పిలుపు కొరకు .. ఈ చావురాని బతుకు....
చూసిచూసి వేచివేచి వేగిపోతున్నదీ... 
ప్రేయసి రావే... ఊర్వశి రావే... ప్రేయసి రావే... ఊర్వశి రావే....!

ఎంత గొప్ప గాయకుడైతే ఏముంది? ఆస్వాదించే శ్రోతలే లేకపోతే, అతని గొంతును మూగతనమే ఆవహిస్తుంది.  ఎంత గొప్ప నర్తకి అయితే ఏముంది? ఆ నాట్యాన్ని వీక్షించే ప్రేక్షకులే లేకపోతే, ఆమె శరీరం కదలక మెదలక పడి ఉండే శిలారూపం అయిపోతుంది.  మనసున్న మనిషి కోసం కురవాలని కోరుకునే వెన్నెలకు ఆ స్పందనలే లేని మనుషులు ఎదురైతే ఏం చేస్తుంది? మనసు విరిగి,  మానవ సమాజాన్ని వదిలేసి, అడవి బాట పడుతుంది. పరిమళాల్ని ఆస్వాదించే హృదయాలే లేకపోతే, పూలు నీరుకారిపోక ఏంచేస్తాయి? గాలిలో పెట్టిన దీపమైనా అంతే కదా! అది ఉన్నట్లూ కాదు ... అది లేనట్లూ కాదు... ఎందుకేంటే, అది ఎప్పటిదాకా వెలుగుతుందో, ఏ క్షణాన ఆరిపోతుందో తెలియదు.  గాలిలో పెట్టిన అనురాగ దీపం కూడా అంతే మరి! అది ఎప్పటిదాకా ఉంటుందో, ఎప్పుడు ఆరిపోతుందో  తెలయదు. అధేమిటో గానీ, ఈ మమకారాల కోసం తపించే మనసులు చాలా సార్లు ఆ మమకారాల మంటల్లోనే కాలిపోతుంటారు.  తన విషయంలో కూడా అదే జరగకబోతోందని తెలిసి తెలిసి కూడా మనిషిలో ఆ ఎదురు చూపులు ఆగిపోవు. ఎప్పటి కైనా తాననుకున్నట్లు జరగకపోతుందా.. అని,  కడ ఊపిరి దాకా కనిపెట్టుకునే ఉంటాడు. కానీ, ఎదురు చూపంటే, అది అగ్ని సరస్సులో ఈదడం లాంటిది!  ఇలాంటి విషయాల్లో నమ్మకం అంటే, అది గుండెను కోస్తున్న రంపం లాంటిది! నమ్మకాలన్నీ నిజాలయ్యే గ్యారెంటీ  ఏమీ ఉండదు. అలాగని  వాటిలో ఏ  ఒక్కటీ నిజం కాదని కూడా చెప్పలేం! వాటిల్లో ఏవో కొన్ని నిజమైనా కావచ్చు. అందుకే నూటిలో, కోటిలో ఒకటిగా తన ఆశే నెరవేరవచ్చు కదా! అనుకుంటున్నాడీ భగ్నప్రేమికుడు.  మనమైనా,  మరీ అంత నిర్లిప్తంగా ఉండిపోవడం ఎందుకు? అతని ఆశలు నిజం కావాలని ఆశిద్దాం! మనస్పూర్తిగా ఆశీర్వదిద్దాం ! వారి కలలకు ఎంత శక్తి ఉందో, కాలం మనసులో ఏముందో, అతని పట్ల  ఎంత సానుకూలంగా వ్యవహరిస్తుందో అదీ చూద్దాం!!

                                                                    - బమ్మెర 

2 కామెంట్‌లు: